భారత్ - చైనా సరిహద్దు చర్చలో డ్రాగన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ...

భారత్ అంటే 1962 నాటి భారత్ కాదనీ... ఇప్పుడు భారత్‌తో పెట్టుకుంటే , చూస్తూ ఊరుకునేది లేదనే సంకేతాల్ని తొలిరోజు చర్చల ద్వారా పంపిన ఇండియన్ ఆర్మీ.

భారత్ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ శక్తిమంతమైన దేశంగా ఉన్న చైనాకి ఇండియన్ ఆర్మీ కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. లడక్ సరిహద్దు వివాదంపై శనివారం రెండు దేశాల కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భారత్ తరపున పాల్గొన్న 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్... చైనా కమాండర్‌ మేజర్ జనరల్ జిన్ జియాంగ్‌కు సూటిగా విషయం చెప్పిన భారత్..

చైనా భూభాగంలోని మోల్డోలో 3 గంటల పాటూ ఈ సమావేశం జరిగింది. ఇందులో పాంగాంగ్ సరస్సు దగ్గర నుంచి చైనా బలగాల్ని వెనక్కి పంపాలని భారత్ కోరింది. అలాగే... వాస్తవాధీన రేఖ (LAC)దగ్గర ఏప్రిల్‌కి ముందు ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి తిరిగి ఉండాలని చైనాను కోరింది. తద్వారా సరిహద్దుల్లో ఆక్రమణలకు వస్తే చూస్తూ ఊరుకోబోమని భారత్ చెప్పినట్లైంది.

ప్రస్తుతం లడక్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు పరిధిలోని ఫింగర్ 4 ప్రాంతంలో అటు చైనా సైనికులు, ఇటు భారత సైనికులూ మోహరించారు. అదంతా ఎత్తైన పర్వతాలతో కూడిన ప్రాంతం. పర్వతాలపై యుద్ధాలు చేసి గెలవడం ఎలా అనే అంశంపై మొన్ననే చైనా సైనికులు మాక్ డ్రిల్ నిర్వహించారు. తద్వారా చైనా - భారత్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.