తిరుగుబాటుదారులూ, ఆనందంగా గడపండి!
౼ మోదీ
౼ మోదీ
కశ్మీరు ఉగ్రవాదులు, ఈశాన్య రాష్ట్రాల్లోని నిషిద్ధ సంస్థల తిరుగుబాటుదారులు, మావోయిస్టులు ఆయుధాలను వదిలిపెట్టి, ప్రశాంతంగా జీవితాన్ని ఆనందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
తన ప్రభుత్వం ఆమోదించిన బోడో త్రైపాక్షిక ఒప్పందం అస్సాంకు శాంతిని తీసుకొస్తుందన్నారు.
ఈ ఒప్పందంతో నూతన శాంతి, అభివృద్ధి శకం ఆరంభమవుతుందన్నారు.
ప్రజల మద్దతుతో ఈ ఒప్పందం శాశ్వత శాంతికి బాటలు పరిచిందని చెప్పారు.
కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల్లో బాంబులు, తుపాకులు, తూటాలతో ఉన్నవారు, నక్సలైట్లు ప్రధాన జీవన స్రవంతిలోకి తిరిగి రావాలని, జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, బోడో గ్రూపులు సంతకాలు చేసిన ఒప్పందం శాశ్వత శాంతిని తీసుకొస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు.
1993, 2003లలో తిరుగుబాటుదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలకు తాజా ఒప్పందం భిన్నమైనదని చెప్పారు.
జనవరి 27న ఈ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే అస్సాంలోని కొక్రజార్‌లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయేలా, దూరమయ్యేలా చేసే సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షాలు గతంలో చొరవ చూపలేదన్నారు.
ఈ సమస్యల పరిష్కరాన్ని బీజేపీయేతర ప్రభుత్వాలు సాగదీశాయని ఆరోపించారు.
తన ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందంలో ఏ డిమాండ్‌నూ వదిలిపెట్టలేదని, అన్ని డిమాండ్లను పరిష్కరించామని చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన తర్వాత మొదటిసారి మోదీ అస్సాం వచ్చారు.
గతంలో రెండుసార్లు ఆయన పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబకడంతో గత ఏడాది డిసెంబరులో జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేతో సమావేశాన్ని ఆయన రద్దు చేసుకున్నారు.
ఈ ఏడాది జనవరిలో ‘ఖేలో ఇండియా’ యువజన క్రీడలను ప్రారంభించవలసి ఉన్నప్పటికీ, ఈ పర్యటన కూడా రద్దయింది

0 Comments